
9న దేశవ్యాప్త సమ్మె
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం కర్నూలు శాఖ కార్యదర్శి సునీయకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం శాఖ అధ్యక్షుడు మక్బూల్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాంచ్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సునీయకుమార్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బీమా చట్టాల సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎల్‌ఐసీలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని మరోమారు చేపట్టనున్నదని, దీన్ని ప్రతిఘటిస్తామన్నారు. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు. 3, 4 తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్‌మెంట్ తక్షణం చేపట్టాలన్నారు. ఎల్‌ఐసీలో పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో ఏజెన్సీ యూనియన్ సెక్రటరీ గజేంద్రరెడ్డి, డెవలప్‌మెంట్ యూనియన్ నేతలు రమేష్, కర్నూలు బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.