ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం! | - | Sakshi
Sakshi News home page

ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!

Jun 24 2025 4:15 AM | Updated on Jun 24 2025 4:19 AM

ఆలూరు: నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వకుండా నాసిరకంగా తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పనులు చేస్తున్నారు. టీడీపీ నేతలు కమీషన్లు ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేసి బిల్లులను దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఎల్లెల్సీ పనుల్లో నాణ్యత కొరవడింది. ఆలూరు నియోజకవర్గంలో 135 కి.మీ. వద్ద ఎల్లెల్సీ కనిపిస్తుంది. ప్రస్తుతం 135 కి.మీ. నుంచి 138 వరకు, హాలహర్వి మండలంలో 155 నుంచి 156 కి.మీ. వరకు, అలాగే 220 నుంచి 222 కి.మీ. వరకు ఎల్లెల్సీ లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. కాలువ పరిధిలో 155 నుంచి 156 కి.మీ. వరకు 950 మీటర్ల మేర లైనింగ్‌ సైడ్‌ వాల్‌ కడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 10 ఎంఎం కడ్డీలకు బదులు 8 ఎంఎం కడ్డీలు వాడుతున్నారు. అలాగే 20 ఎంఎం చిప్స్‌కు బదులు 15 ఎంఎం చిప్స్‌ను, నాణ్యతలేని ఇసుకను వినియోగిస్తున్నారు.

‘చిన్న’బోయిన పనులు

కాలువ 155 నుంచి 156 కి.మీ. వరకు చిన్నగా ఉంది. అధిక క్యూసెక్కుల నీటిని తట్టుకోవాలంటే అందుకు కాలువ ఎత్తుతోపాటు డిజైనింగ్‌ కోసం రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు రాళ్లపైనే కడ్డీలను కడుతున్నారు. దీంతో కాలువ నీటి ప్రవాహంలో అవి కొట్టుపోయే పరిస్థితి నెలకొంది.

● చింతకుంట పరిధిలో 136 నుంచి 138 కి.మీ. వరకు జరుగుతున్న పనులకు ముందుగా ఎర్రమట్టి వేయాలి. అలాకాకుండా పనులు కొనసాగిస్తున్నారు.

● హొళగుంద పరిధిలో 202 నుంచి 222 కి.మీ. వరకు లైనింగ్‌ పనులు చేయగా అప్పుడే పెచ్చులూడిపోయాయి.

ఇదీ దుస్థితి..

ఖరీఫ్‌ సీజన్‌లో సాగు, తాగునీటి విడుదలపై ఈనెల 27న తుంగభద్ర బోర్డు అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఎల్లెల్సీ పనులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జరగలేదు. పనులు నాసిరకంగా ఉన్నాయి. ఈఈ, డీఈఈల పర్వేక్షణ అంతంతా మాత్రంగానే ఉంది. కాలువలో నీరు దిగువకు వచ్చేనా అని ఆదోని, ఎమ్మినూరు, కోడుమూరు డివిజన్లకు సంబంధించిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతలకు మేలు చేయాలి

రైతుల సమస్యలను టీడీపీ నేతలు పట్టించుకోరు. వారికి వారి సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఎక్కడ పనులు చేస్తున్నా వారికి కమీషన్లు ఇవ్వాలి. ఎల్లెల్సీ పనుల్లో నాణ్యత ఎలా ఉందో అధికారులకే తెలియాలి. అన్నదాతలకు మేలు చేసే విధంగా పనులు చేయాలి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.

– బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే

తూతూ మంత్రంగా

తుంగభద్ర దిగువ లైనింగ్‌ పనులు

కొరవడిన ఇంజినీర్ల పర్యవేక్షణ

కమీషన్లు ఇవ్వాలని

టీడీపీ నేతల ఒత్తిళ్లు?

ఫిర్యాదులు ఇవీ..

ఎల్లెల్సీ పనులు చేసే కాంట్రాక్టర్లు కచ్చితంగా కమీషన్లు ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పనులు చేయించబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంజినీర్లుపై కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. టీడీపీ నేతలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవద్దంటూ టీడీపీ ప్రజాప్రతినిధులతో చెప్పించిట్లు తెలుస్తోంది.

ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!1
1/2

ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!

ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!2
2/2

ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement