
ఖాతాలకు ఎన్‌పీసీఐ లింకు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల కావాలంటే తల్లి పోస్టల్ లేదా బ్యాంకు ఆధార్ నెంబర్ ఖాతాలకు ఎన్‌పీసీఐ లింక్ చేయాలని ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.తులసీ దేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఎంపీడీఓ, ఏఎస్‌డబ్ల్యూఓ, గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని అర్హత కలిగిన విద్యార్థులను గుర్తించి ఎన్‌పీసీఐ లింకు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 9, 10 తరగతులకు చెందిన 164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ పెండింగ్‌లో ఉందన్నారు. అలాగే 764 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాలకు కూడా ఎన్‌పీసీఐ లింక్ కాలేదన్నారు. ఎస్సీ విద్యార్థులకు సింగల్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే, అది కూడా విద్యార్థి ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాకు తల్లికి వందనం నిధులు విడుదల అవుతాయన్నారు. రేపటిలోగా ఎన్‌పీసీఐ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె కోరారు.
ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 32, పట్టణ ప్రాంతాల్లో 12 ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, జీతం మొదలైన వివరాలు, దర ఖాస్తు నమూనాలు https://kurnool.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్‌లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఈ నెల 24వ తేది ఉదయం 10 గంటల నుంచి 28వ తేది సాయంత్రం 5 గంటల వరకు అర్బన్ ప్రాంతం వారు వార్డు సచివాలయం పరిధిలోని యుపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌కు, గ్రామీణ ప్రాంతం వారు ఆ గ్రామం పరిధిలోని పీహెచ్‌సి మెడికల్ ఆఫీసర్‌కు స్వయంగా అందజేయాలన్నారు. నియామకాలు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ(డీహెచ్‌ఎస్) ఆధ్వర్యంలో చేపడతామన్నారు.
కార్డియాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్ ఆదిలక్ష్మి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్ బి.ఆదిలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. వైజాగ్‌కు చెందిన ఈమె ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్ కాకినాడ ఆర్‌ఎంసీ కళాశాలలో అభ్యసించారు. అనంతరం వైజాగ్‌లోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో డీఎం కార్డియాలజీ పూర్తి చేశారు. 2008లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వైజాగ్‌లో చేరారు. ఆ తర్వాత 2015లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల కార్డియాలజీ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2019 నుంచి తిరిగి వైజాగ్‌లో విధులు నిర్వహించి 2022లో అక్కడే హెచ్‌ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు.
16 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని 16 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 5.3 మి.మీ వర్షపాతం నమోదైంది. దేవనకొండలో 31.6 మి.మీ, ఆదోనిలో 16.2, నందవరంలో 14.2, కోసిగిలో 12.2, గూడూరులో 12.2, పెద్దకడుబూరులో 10.2 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. కౌతాళం, ఎమ్మిగనూరు, ఆస్పరి, కర్నూలు రూరల్, అర్బన్ మండలాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 69.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలలో మురిపించిన వర్షాలు.. జూన్ నెలలో నిరాశకు గురి చేస్తుండటంతో పంటల సాగులో పురోగతి లోపించింది.
శ్రీశైలానికి తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. గత ఆదివారం ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 76,178 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో ఆదివారం నుంచి సోమవారం వరకు 60,336 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనను గత ఐదు రోజుల నుంచి నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కూడా దిగువ ప్రాంతాలకు నీటిి విడుదల నిలిలిచిపోయింది. డ్యాం నీటిమట్టం 857 అడుగులకు చేరుకుంది.