
28లోపు ఉచిత విద్య ప్రవేశాలు
కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 12(1)(సీ) కింద 1వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థులందరినీ ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఈ నెల 28వ తేదీలోపు చేర్చుకోవాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూలు ఏక్యాంపులోని మాంటెస్సోరి హైస్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ ఆన్–ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉచిత విద్యను అందిస్తామని దరఖాస్తూలు చేసుకున్న స్కూళ్లకు చెందిన వారందరు మొదటి, రెండో విడతల్లో సీట్లు కేటాయింపులు చేశారన్నారు. మొదటి విడతలో 384 స్కూళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా 122 స్కూళ్లకు చెందిన వారు మాత్రమే 2289 మంది విద్యార్థులకు సీట్లు కేటాయిస్తే, 1110 మందిని స్కూళ్లలో చేర్పించుకున్నారన్నారు. 1179 మందిని ఇంత వరకు 262 స్కూళ్ల యాజమాన్యాలు చేర్చుకోలేదన్నారు. రెండో విడత కింద 173 స్కూళ్లలో 1056 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తామని, అందుకు కావాల్సిన అకౌంట్స్, ఇతర పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీనిచ్చారు. ఆ తరవాత ఆంధ్రప్రదేశ్ ఆన్–ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ జిల్లా అద్యక్షులు వాసుదేవయ్య, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డిలు యాజమాన్యాల ఇబ్బందుల గురించి డీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ ధన్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్