
హామీల అమలులో ఘోర విఫలం
హొళగుంద: వివిధ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విమర్శించారు. హామీల అమలులో సీఎం చంద్రబాబు ఘోర విఫలం చెందారన్నారు. హొళగుందలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి చేసే ఖర్చులు ప్రజల బాగు కోసం చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద ఇంకా 60 శాతం మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని ఈ నెల 20న చెప్పినా..ఇప్పటి వరకు ఆచరణ కాలేదన్నారు. ఏడాది దాటినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉచిత గ్యాస్ చాలా మంది అర్హులకు అందడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్, ఆడబిడ్డ నిధి తదితర పథకాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
గుణపాఠం తప్పదు
హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధింపుల పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరగక తప్పదని ఎమ్మెల్యే అన్నారు. కర్నూలులో సోమవారం నిర్వహించే యువత పోరు కార్యక్రమానికి నిరుద్యోగులు, యువత తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మండల కన్వీనర్ షఫివుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, నాయకులు ఈశా, కోగిలతోట శేషప్ప, కెంచప్ప, మల్లికార్జున, హనుమప్ప, సమ్మతగేరి నాగరాజు, వెంకటేష్, సిద్దయ్య, లక్ష్మన్న, సిద్దప్ప, శేఖర్ తదితరులు ఉన్నారు.
ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి