
గోనెగండ్లలో కలుషిత నీటి సరఫరా
గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో కొన్ని రోజులుగా మంచినీటి కుళాయిలకు కలుషిత నీరు వస్తోంది. పాచి పట్టి దుర్వాసనతో వస్తుండటంతో ఆ నీటిని తాగేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోనెగండ్లలో 30 వేల మంది ప్రజలు ఉండగా ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం కుళాయిలకు పచ్చటి పాచి పట్టి దుర్వాసనతో కూడిన నీరు వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నీటిని తాగితే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు.

గోనెగండ్లలో కలుషిత నీటి సరఫరా