
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
ఆదోని రూరల్: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య మండిపడ్డారు. ఆదివారం ఆదోని పట్టణంలోని రెడ్డి హాస్టల్‌లో సీపీఐ 20వ ఆదోని పట్టణ, మండల మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రామచంద్రయ్యతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య హాజరయ్యారు. ముందుగా స్థానిక మున్సిపల్ మైదానం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కామ్రేడ్ మహాదేవ ఆచారి ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాయన్నారు. నమ్మి ప్రజలు ఓట్లేశాక వారిని మోసగిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. దళితుల పట్ల వివక్ష పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లింగప్ప, అజిత్‌గౌడ్, ఏఐఎస్‌ఎఫ్ పట్టణ కార్యదర్శి దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
పి.రామచంద్రయ్య ధ్వజం