
ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్య
కర్నూలు: కర్నూలు టీజే మాల్‌లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమల రావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్‌తో అ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్‌ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమల రావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి రహస్య విచారించారు.బ్యాంకు మేనేజర్ తిరుమల రావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విచారణ జరుపుతున్న గద్వాల పోలీసులు