
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఇద్దరు శ్రీశైల ఆలయ ఉద్యోగులపై వేటు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులపై దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదివారం ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. గత నెల 27వ తేదీన దేవస్థానంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు చేపట్టారు. ఆ సమయంలో రెండు సంచులలోని నాణేలను అక్కడే మరిచిపోయారు. ఈ విషయంపై దేవస్థానం ఈఓ అంతర్గత విచారణ చేపట్టారు. ఈ విచారణలో దేవస్థానంలో క్యాషియర్‌గా విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసులు, మంజునాథ్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్దారించి అధికారులు ఈఓకు నివేదికను సమర్పించారు. ఈ మేరకు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల (సస్పెన్షన్) చేశారు. కాగా జూనియర్ అసిస్టెంట్ మంజునాథ్ ఇటీవల సాధారణ బదిలీలలో భాగంగా కాణిపాకం దేవసస్థానానికి బదిలీ అయ్యారు. సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కాణిపాక దేవస్థాన ఈఓను శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు కోరారు.