
మొబైల్‌కు దూరంగా ఉంచడమే మేలు
పిల్లల భాషా నైపుణ్య అభివృద్ధికి మొబైల్ తెరలే అవరోధంగా నిలుస్తున్నాయి. అల్లరి మాన్పించేందుకు, ఆహారం తినిపించేందుకు అలవాటు పడిన ఈ మొబైల్ ఫోన్ వారిని బానసలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారుల ఎదుగుదలపై అవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇంట్లోని పెద్దలు సైతం వారి ఇంట్లోని చిన్నారులను మొబైల్‌కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ మేరకు ముందుగా పిల్లల ముందు పెద్దలు సైతం మొబైల్ ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలు. పెద్దలు వాడకపోతే పిల్లలు అటువైపు దృష్టి సారించరు. ఈ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కొనివ్వడం, ఆటలు ఆడించడం, మైదానాలు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, బందువుల ఇళ్లకు తీసుకెళ్లి వారిని పరిచయడం చేయించడం, వారి పిల్లలతో స్నేహం చేయించడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి చెందుతుంది.
● మూడేళ్లయినా మాటలు రాని
చిన్నారులు
● పదాలు పలికేందుకు ఇబ్బందులు
● సెల్‌ఫోన్ వాడకమే
కారణమంటున్న వైద్యులు
● చిన్నపిల్లల వైద్యుల వద్దకు
తల్లిదండ్రుల క్యూ
ఒకప్పుడు చంటిపిల్లలకు చందమామను చూపి గోరుముద్దలు తినిపించేవారు. ఆ తర్వాత తరం వారు వీధిలోకి వెళ్లి జంతువులు, ఇతర పిల్లలను చూపిస్తూ అన్నం పెట్టేవారు. గత తరం వారు టీవీలో కార్టూన్ బొమ్మలు చూపించి పిల్లలకు భోజనం పెట్టేవారు. కానీ నేటితరం మాత్రం మొబైల్ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు. అలవాటైన చిన్నారులు రాత్రింబవళ్లూ మొబైల్ కావాలంటున్నారు. దీంతో వారికి మూడేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాని పరిస్థితి నెలకొంటోందని, చిన్న పదాలు కూడా పలకడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
– కర్నూలు(హాస్పిటల్)
● కర్నూలుకు చెందిన లలితకుమారికి భర్త ఇటీవలే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారున్ని అల్లారుముద్దుగా పెంచేందుకు ఆమె రెండేళ్ల వయస్సు నుంచే పిల్లాడిని గారాబం ఎక్కువ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు సెల్‌ఫోన్‌కు ఎక్కువగా బానిసయ్యాడు. అర్ధరాత్రి 2 గంటలైనా సెల్‌ఫోన్ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలో బాలుడు నాలుగేళ్ల వయస్సు వచ్చినా మాట్లాడటం లేదు.
● కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన శివరాముడుకి ఒక కుమారుడు ఉన్నాడు. పాలుతాగాలన్నా, ఏదైనా తినాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ బాలునికి మూడేళ్ల వయస్సు. ఇప్పటికీ ఆ బాలుడికి మాటలు రావడం లేదు.

మొబైల్‌కు దూరంగా ఉంచడమే మేలు