
సిల్వర్‌సెట్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన సిల్వర్‌సెట్ ఫలితాలను క్లస్టర్ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు, రిజిస్ట్రార్ డా.కె వెంకటేశ్వర్లు శనివారం వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ ప్రవేశాలకు ఎంతో పోటీ ఉంటుందన్నారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సిల్వర్ సెట్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 29న సిల్వర్ సెట్ పరీక్ష నిర్వహించామని, 1,196 మంది విద్యార్థులు హాజరు కాగా 1,085 మంది అర్హత సాధించారన్నారు. బీఏలో ఈవూరి సుస్మిత ఫస్ట్ ర్యాంకు సాధించారని, బి.కామ్‌లో జి.మానస, బీఎస్సీ మ్యాథ్స్‌లో పి.చిరు హాసిని, బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో షేక్ హమ్నా లేహర్ మొదటి ర్యాంకు సాధించారన్నారు. కార్యక్రమంలో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాస్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఇందిరాశాంతి, కేవీఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, సిల్వర్‌సెట్ కన్వీనర్ మహమ్మద్ వాహీద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, క్లస్టర్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజు శెట్టి పాల్గొన్నారు.
సూక్ష్మ సేద్యానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): బిందు, తుంపర్ల సేద్యం కోసం రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. 2025–26 సంవత్సరంలో 7వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించాలనేది లక్ష్యమని.. బోరు, బావి ఉన్న రైతులు సూక్ష్మ సేద్య సదుపాయం పొంది ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సూక్ష్మ సేద్యం చక్కటి అవకాశమన్నారు. గత ఏడాది 5,961 మంది రైతులకు 5,653.09 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం కల్పించినట్లు తెలిపారు. ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీ ఉంటుందన్నారు. 10 ఎకరాలు పైబడిన రైతులకు 50 శాతం రాయితీతో డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. స్ప్రింక్లర్లు అన్ని కేటగిరీల రైతులకు 50 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. నాన్ సబ్సిడీ చెల్లించిన రైతులకు త్వరలోనే అనుమతులు ఇస్తామన్నారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే meekosam. ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.