
నిత్య యోగాతో ఆరోగ్యం
కర్నూలు(టౌన్): అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలని, నిత్య యోగాతోనే అది సాధ్యమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో కర్నూలు జిల్లా నుంచి 12,76,000 మంది రిజిస్రేషన్ చేసుకోవడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఇక మీదట కూడా యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, మహిళలు, అధికారులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.