
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు ...
● ఆటో బోల్తా పడి వృద్ధురాలి దుర్మరణం
గోస్పాడు/మహానంది: ఎస్.నాగులవరం–పసురపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం దైవదర్శనం నిమిత్తం రంగాపురం సమీపంలోని మద్దిలేటిస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. పూజలు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఎస్.నాగులవరం సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆవుల లక్ష్మీదేవి(65) అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్వర్లు, మౌనిక, చిన్న సరవయ్య, లక్ష్మిపతి, ఆవుల నరసమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆవుల నరసమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతురాలు లక్ష్మీదేవి భర్త గత కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
పాణ్యం: పిన్నాపురం గ్రామ రస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శనివారం సాయంత్రం గొర్రెల కాపరులు గడ్డిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా వ్యక్తి మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, కాళ్లకు బెల్ట్ చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు ...