
కర్నూలులో 23న యువత పోరు
కర్నూలు (టౌన్): కర్నూలులో ఈనెల 23వ తేదీ యువత పోరు పేరుతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆద్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘యువత పోరు’ పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. యువత కోసం ఏటా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని.. లేదంటే తమ కాలర్ పట్టుకోవాలని నారా లోకేష్ పలు సమావేశాల్లో చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం చేయడంతో అరకొరగా తల్లికి వందనం నిధులు విడుదల చేశారని విమర్శించారు.
బెదిరిస్తే భయపడేది లేదు!
సూపర్ సిక్స్ హామీలు నేరవేర్చామని, ఏవరైనా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తే వారి నాలుక మడత పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు బెదిరింపులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని ఎస్వీ అన్నారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగలకు రూ. 3 వేలు ఇచ్చారా.. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ. 1500, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలకు పెన్షన్ రూ. 4 వేలు, అన్నదాత సుఖీభవ రూ. 20 వేలు ఇలా.. సూపర్ సిక్స్ కింద ఇస్తామని ఈ పథకాలన్నీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యువత పోరు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. ఏడాది దాటినా ఫీజు బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువకులు, నిరుద్యోగులు తరలి రావాలని పిలుపు నిచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం, విధ్యార్థి విభాగం, అనుబంద విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
నిరుద్యోగులను దగా చేసిన
కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి