
క్వింటా పత్తి రూ.8,025
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా పత్తి ధర రూ.8 వేలు దాటింది. యార్డులో అమ్మకానికి రైతులు 300 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. గరిష్ట ధర రూ.8,025, మధ్య ధర రూ.7,689, కనిష్ట ధర రూ.4,511 నమోదైంది. అదేవిధంగా వేరుశనగకాయలు 16 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.5,682, కనిష్ట ధర రూ.4,800 లభించింది.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
కర్నూలు(సెంట్రల్): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలో 5,264 వేదికల్లో 12లక్షల మందితో యోగాసనాలు వేయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతనెల మే 21 నుంచి యోగాంధ్ర పేరిట గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. జూన్ 21న శనివారం జిల్లా వ్యాప్తంగా 5,264 వేదికల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. జిల్లాస్థాయిలో నగరంలోని అవుట్‌డోర్ స్టేడియంలో 5వేల మందితో యోగా కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
స్కూళ్లలోనే విద్యార్థులకు అల్పాహారం
కర్నూలు సిటీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేటి(శనివారం)ఉదయం 8.30 గంటలకు విద్యార్థులకు స్కూళ్లలోనే అల్పాహారం అందించాలని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన స్కూళ్ల ప్రధానోపాద్యాయులు యోగాంధ్ర కార్యక్రమం తరువాతే ఉప్మా, చెట్నీ తయారు చేయించాలన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందించే ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అల్పాహారం ఎట్టి పరిస్థితుల్లో యోగాకు ముందు ఇవ్వకూడదని డీఈఓ పేర్కొన్నారు.
రానున్న ఐదు రోజుల్లో
తీవ్ర గాలులు
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఇదిలాఉంటే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మే నెలలో అధిక వర్షాలు కురిశాయి. జూన్ నెలలో ఒకటి, రెండు రోజుల పాటు వర్షాలు కురిసినప్పటికీ అనావృష్టి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గాలి తీవ్రత పెరిగింది. ఈ నెల 25 వరకు బలమైన గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నెల 21న 1.2 మి.మీ, 22న 1.0 మి.మీ, 23 నుంచి 25 వరకు 0.5 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు వేసవి తరహాలో 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాలి వేగం 21 నుంచి 22 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో వర్షాలు లేకపోతే ప్రధానంగా సాగు చేసిన పత్తి పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది.