
ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు
ఆలూరు రూరల్: ‘‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన కార్యక్రమం నుంచి జనం దృష్టి మరల్చేందుకే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాత్రికి రాత్రే బెంగళూరులో అరెస్టు చేశారు. అక్రమ కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేయాలని కూటమి నేతల అవివేకం. ఇలాంటి వాటికి బెదిరేది లేదు’ అని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది నుంచి రాష్ట్రంలో అరాచక పాలనకు అంతులేకుండా పోయిందని, రెడ్‌బుక్ పేరిట అక్రమ అరెస్టులు చేయడం కూటమి నాయకులకే చెల్లిందన్నారు. జరగని స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చేర్చి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజల నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి భయపడి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న పాలనను ప్రజ లు గమనిస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవ న్ కల్యాణ్ ఎక్కడున్నాడో తెలియదని, ఆయన ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఒక పక్క హత్యలు, హత్యాచారాలతో రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్ష ణ లేకుండాపోయిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటనకు ప్రజలు రాకుండా ఎన్ని ఆంక్షలు విధించినా వారిని నిలువరించలేకపోయారన్నారు.