
పట్టపగలే చోరీ
● 6 తులాల బంగారు నగలు,
రూ.2 లక్షల నగదు అపహరణ
ఓర్వకల్లు: మండలంలో గురువారం పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన మీదివేముల గ్రామంలో చోటుచేసుకొంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి వ్యయసాయ పనులు చేస్తుండగా, భార్య కళావతి స్థానిక అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌గా పనిచేస్తోంది. రోజులాగే ఇంటికి తాళం వేసి, వారి కూతురి పిల్లలను పక్కంటి వారి వద్ద వదిలి తమ పనుల నిమిత్తం వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపు పెకిలించి అందులోని 6 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటంతో పొరుగింటి వారితో చెప్పగా వారు ఇంటి యజమానులకు విషయం తెలియజేశారు. వారు ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్ గ్రామానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.