
విజయేంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
హొళగుంద: మండల కేంద్రంలోని కోట ఆంజనేయస్వామి ఆలయంలో వెలసిన విజయేంద్రతీర్థుల 411వ ఆరాధనోత్సవాలు శుక్రవారం నుంచి స్థానిక అర్చక బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారికి ధ్వజారోహణం, ప్రార్థనోత్సవం, గోపూజ, లక్ష్మీపూజ, శాఖా–ధాన్యోత్సవ పూజ, స్వస్తివాచన, మహామంగళారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు పూర్వరాధన, ఏకాదశి, మధ్యరాధన, ఉత్తరాధన తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 24న ఉత్తరాధన రోజు స్వామి రథోత్సవం, ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీపురందరదాసర భజన మండళి, భక్తి భారతి కోటాల మండళి బృందాలతో భజనాలు, కోలాట కార్యక్రమంతో పాటు స్వామి వారికి స్వస్తివాచన, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి, పాండురంగాచారి, మురళీధరాచారి, వెంకటేశాచారి, రాఘవేంద్రాచారి తెలిపారు.