
ఉత్తీర్ణత శాతం మెరుగుపరచండి
● డీఈఓ శామ్యూల్‌పాల్
ఆదోని సెంట్రల్: పదో తరగతి పరీక్షల్లో తప్పిపోయిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్ అన్నారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి సబ్జెక్టు టీచర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, గురుకులం, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాశారన్నారు. వారిలో 20,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 10,600 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణత శాతంలో మన జిల్లా 25వ స్థానానికి పడిపోయినట్లు వారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 75 శాతం వృద్ధిని సాధిస్తే అది టీచర్స్ సక్సెస్‌గా, 50 శాతం ఉత్తీర్ణత సాధిస్తే అది విద్యార్థి సక్సెస్‌గా మన జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా పేర్కొన్నట్లు చెప్పారు. 50 శాతం తక్కువగా ఉత్తీర్ణత సాధించిన పాఠశాలకు నోటీసులు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. పెద్దకడబూరు, కౌతాళం, ఆలూరు మండలాల్లో కొన్ని పాఠశాలల్లో అత్యధికంగా ఫెయిల్యూర్ అయిన విద్యార్థులు ఉన్నారన్నారు. పత్తికొండ డివిజన్ ఉత్తీర్ణత శాతంలో వెనకబడినట్లు చెప్పారు. సమావేశంలో డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ శామ్యూల్‌పాల్