
లేఅవుట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు మండలం బనవాసిలో సకల సదుపాయాలతో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ను సిద్ధం చేశామని కలెక్టర్ పి.కోటేశ్వరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రోగ్రామ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బనవాసిలో స్మార్ట్ టౌన్ షిప్‌లో 1,106 ప్లాట్లు ఉన్నాయన్నారు. వీటిని మూడు రకాలుగా విభజించినట్లు చెప్పారు. మూడు సెంట్లకు సంబంధించి 447, నాలుగు సెంట్లకు సంబంధించి 460, ఐదు సెంట్లకు సంబంధించి 199 ప్లాట్లు ఉన్నాయన్నారు. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 64 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ లేఅవుట్‌కు సంబంధించిన అనుమతులన్నీ ఇప్పటికే పొందామని, త్వరలోనే జిల్లా స్థాయి కమిటీలో ధరను నిర్ణయించి విక్రయానికి అందుబాటులోకి తెస్తామన్నారు. మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రిబేటు ఉంటుందన్నారు. లేఅవుట్ మొత్తంలో వారికి 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేస్తామన్నారు. ప్లాటు విలువను మొత్తం ఒకేసారి చెల్లించే వారికి మరో 5 శాతం రాయితీ ఉటుందన్నారు. కార్యక్రమంలో జేసీ రామసుందర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ భార్గవ్‌తేజ, ఆదోని సబ్‌కలెక్టర్ అభిషేక్‌కుమార్ పాల్గొన్నారు.
మధ్యతరగతి ప్రజలకు
తక్కువ ధరకే ప్లాట్లు
కలెక్టర్ కోటేశ్వరరావు