
ప్రాథమిక పాఠశాల విద్య ఇక నిర్వీర్యం
కర్నూలు సిటీ: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాథమిక విద్యను ఇక నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పాఠశాల పునఃవ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉల్చాల రవికుమార్, నవీన్ పాటి, జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్‌కుమార్ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం విస్మరించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జీఓ 117 రద్దు చేసి, పాత విధానాన్నే తీసుకొస్తామని హామీనిచ్చిన విషయం మర్చిపోయారన్నారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ గందరగోళంగా మారిందన్నారు. వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని కోరారు. ఎస్‌జీటీలకు మ్యానువల్‌గానే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని, పదోన్నతుల్లో సీనియారిటీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం డీఈఓ శామ్యూల్ పాల్‌కి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఆ సంఘం నాయకులు జయరాజు, హనుమంతు, యేహోషువా, కౌలన్న, భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని
మార్చుకోవాలి
డీఈఓ కార్యాలయం ఎదుట
ఉపాధ్యాయుల ధర్నా