అధికారుల నిర్లక్ష్యంతోనే వెండి మాయం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ - Sakshi

కర్నూలు: ‘‘వాహన తనిఖీల్లో పట్టుబడి కర్నూలు అర్బన్‌ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచిన వెండి, నగదు అధికారుల నిర్లక్ష్యం వల్లే మాయమ య్యింది. ఈ ఘటన జరగడం బాధాకరం. డీఎస్పీ స్థాయి అధికారితో హార్డ్‌ క్రిమినల్‌ విచారణ చేశాం. శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి’’ అని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ వెల్లడించారు. పోలీస్‌ స్టేషన్‌లో 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదును చోరీ చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతి, కానిస్టేబుల్‌ రమణ బాబు, వారికి సహకరించిన అమరావతి భర్త విజయభాస్కర్‌, అతని తమ్ముడు భరత్‌సింహాలను కర్నూలు అర్బన్‌ తాలూకా పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఎదుట హాజరుపరిచారు. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ డి.ప్రసాద్‌, డీఎస్పీలు కేవీ మహేష్‌, యుగంధర్‌ బాబుతో కలసి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. వివరాలు ఎస్పీ మాటల్లోనే..

రూ.2.05 లక్షలు వాడుకున్నారు

‘‘2021 జనవరి 27వ తేదీన అప్పటి తాలూకా సీఐ విక్రమ సింహా పోలీసు సిబ్బందితో కలసి కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం సేలం పట్టణానికి చెందిన సందన్‌ భారతి గోవిందరాజ్‌ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి ఆధారాలు లేని 105 కిలోల వెండి వస్తువులు, రూ.2.05 లక్షల నగదు బయట పడింది. పోలీస్‌ ప్రొసీడింగ్స్‌ ద్వారా వాటిని సీజ్‌ చేసి స్టేషన్‌లో భద్రపరిచేందుకు అప్పటి రైటర్‌ రమణబాబుకు అప్పగించారు. తదుపరి చర్యల నిమిత్తం కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖకు లెటర్‌ రాయగా వెండి వస్తువులకు సంబంధించి బిల్స్‌ తనిఖీ చేసి రూ.35 లక్షలు అపరాధ రుసుం విధించారు. పోలీస్‌ స్టేషన్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్టాఫ్‌ రూముకు పక్కన ఉన్న ప్రాపర్టీ రూమ్‌లో వెండిని భద్రపరచి రూ.2.05 లక్షల నగదును మాత్రం అధికారులకు తెలియకుండా రమణ బాబు సొంత ఖర్చులకు వాడుకున్నారు. అతను అక్కడి నుంచి బదిలీ అయ్యాక తర్వాత రైటర్‌గా పనిచేసిన అమరావతికి ఆ డబ్బుతో పాటు వెండిని కూడా అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది.

సొత్తును దొంగలించేందుకు పథకం

కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖ వారు ఎక్కువ మొత్తంలో ఫైన్‌ విధించడంతో యజమాని గోవిందరాజు సొమ్మును తీ

సుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతి నిర్ధారించుకుని భర్త విజయ్‌భాస్కర్‌తో చర్చించారు. సొత్తును దొంగలించేందుకు పథకం రచించినట్లు విచారణలో బయటపడింది. ఆమె మరిది భరత్‌సింహాకు షరాఫ్‌బజార్‌లో బంగారు దుకాణం ఉన్నందున వెండిని కరిగించేందుకు అతనితో కూడా మాట్లాడి ఒప్పించినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే కానిస్టేబుల్‌ రమణబాబుకు చెప్పకుంటే ఎప్పటికై నా బయటపడుతుందని భావించి అతనిని భాగస్వామిని చేసి మాట్లాడి ఒప్పించి అందరూ కలసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.

విచారణ కొనసాగుతోంది

సొమ్ము మాయంపై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అరెస్టు చేసి ఉద్యోగం కూడా తీయిస్తారని భావించి కర్ణాటకలో దొంగిలించిన వెండిని విక్రయించి నగదుగా మార్చుకుని హైకోర్టులో బెయిల్‌ తీసుకుందామని కియా కారులో పారిపోతుండగా పక్కా సమాచారం మేరకు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు, 81.52 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు’’ అని ఎస్పీ వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం దొంగతనంపై మాత్రమే విచారణ చేపట్టామన్నారు. శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని, అందులో అధికారుల పర్యవేక్షణ లోపాలతోపాటు వారి పాత్ర కూడా ఉన్నట్లు తేలితే కచ్చితంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు పి.రామలింగమయ్య, తబ్రేజ్‌, అబ్దుల్‌ గౌస్‌, శ్రీనివాసులు, ఎస్‌ఐ మన్మథ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సొత్తు చోరీపై హార్డ్‌ క్రిమినల్‌

విచారణ చేశాం

అధికారుల పాత్ర తేలితే

చర్యలు తీసుకుంటాం

మరో ఇద్దరు అరెస్టు

రూ.10 లక్షల నగదు,

81.52 కేజీల వెండి సీజ్‌

ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top