
శ్రీశైలం: శ్రీశైలం – దోర్నాల ఘాట్ రోడ్డులో శిఖరేశ్వరం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అర్చకులు శివనాగప్రసాద్ (42) ఉదయం ఆత్మకూరు సమీపంలోని ముష్టపల్లెలో జరిగే పార్వేట పూజలు నిర్వహించేందుకు స్కూటీపై బయలుదేరాడు. మార్గమధ్యలో శిఖరేశ్వరం వద్ద మలుపులో దోర్నాల వైపు నుంచి శ్రీశైలానికి వేగంగా వస్తున్న బొలేరొ వాహనం మలుపు వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో శివనాగప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలేరొ వాహనం పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీకొని బొల్తా పడింది. ఆ సమయంలో రైలింగ్ ఇనుప రేకు బొలేరొలోకి దూసుకెళ్లి అందులో ఉన్న మాచర్ల వాసి కొరటా వెంకటేశ్వర్లు (35) కడుపును చీల్చడంతో మృతి చెందాడు. అందులో ఉన్న మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం వారిని ప్రాజెక్ట్ కాలనీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలం ప్రకాశం జిల్లా పరిధిలో ఉండటంతో సమాచారం అందుకున్న దోర్నాల ఎస్‌ఐ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని బొలేరొ వాహనంలో చిక్కుకున్న వెంకటేశ్వర్లు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎంతో శ్రమించారు. మృతుడు శివనాగప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
అదుపు తప్పి స్కూటీని డీకొట్టిన బొలేరొ
శ్రీశైలాలయ అర్చకుడు మృతి
బొలేరొలోకి దూసుకెళ్లిన రైలింగ్ రేకు
అందులో ఉన్న మాచర్ల వాసి మృతి

బోల్తా పడిన బొలెరో వాహనం, చనిపోయిన కొరటా వెంకటేశ్వర్లు (ఫైల్), అర్చకుడు శివనాగప్రసాద్
