పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం నాయీబ్రాహ్మణులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ నేతలు కొలిపాక బ్రహ్మం, రాము, ఉప్పు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం
పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ సీహెచ్ దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, అశోక్ తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 12న సత్యసాయి జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన కదిరిలో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించారన్నారు. దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించగా, 70 కేజీల పైవిభాగంలో రాహుల్‌కృష్ణ బెస్ట్ ఆఫ్ సిక్స్ సాధించాడన్నారు.
కనులపండువగా నరసింహునికి చక్రతీర్థం
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి చక్రతీర్థం కార్యక్రమాన్ని కనులపండువగా చేశారు. స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా సమీపంలోని కృష్ణానదిలో అర్చకులు పరాంకుశం శ్రీనివాసాచార్యులు, వేదాంతం శ్రీధరాచార్యులు, మురళీధరాచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేసి చక్రతీర్థం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. రాత్రికి పూర్ణాహుతి, ధ్వజారోహణ చేశారు. ఈవో సురేష్‌బాబు, భక్తులు పాల్గొన్నారు.
స్విమ్మర్లకు అభినందన
పటమట(విజయవాడతూర్పు): ఖేలో ఇండియా–2025 యూత్ గేమ్స్ అండర్–18 కేట గిరీలో ఆలిండియా చాంపియన్‌షిప్‌లో 64 పాయింట్లతో ఏపీ తృతీయ స్థానంలో నిలిచింది. విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్–18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయిలను వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన స్విమ్మర్లకు వీఎంసీ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ.రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి.వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి 7,762 మంది హాజరు
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రెండో రోజైన మంగళవారం జిల్లా వ్యాప్తంగా 7,762 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐఓ పీబీ సాల్మన్‌రాజు తెలిపారు. జిల్లాలోని 42 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన మొదటి ఏడాది ఇంగ్లిష్–1 పరీక్షకు 7,626 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 7,306 మంది హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన రెండో ఏడాది ఇంగ్లిష్–2 పరీక్షకు 136 మంది హాజరవ్వాల్సి ఉండగా 115 రాశారని తెలిపారు.

తిరుపతమ్మకు బోనాలు