
ఎండీ ఆలీఖాన్
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా సంస్థలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా సంస్థ అధికారి ఎం. ఏసుదానం తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల కాలం పూర్తి అయిన వాహనాలను గుర్తించి మార్చి 31 నుంచి నిలిపివేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని విద్యాధరపురం, గవర్నర్‌పేట–1, 2, ఇబ్రహీంపట్నం, ఆటోనగర్ డిపోల నుంచి వివిధ రూట్‌లలో నడుపుతున్న కొన్ని బస్సులు ఆపామని పేర్కొన్నారు. దీని వల్ల ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాటి స్థానంలో 82 కొత్త బస్సులను తీసుకొచ్చి ఏప్రిల్ 1 నుంచి ఆయా రూట్‌లలో తిప్పుతామన్నారు.
ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు
పెనమలూరు: ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రపంచ స్థాయిలో పది అగ్ర నేత్ర ఆరోగ్య సంస్థలో ఒకటిగా నిలిచిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్‌గర్గ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు. స్పెయిన్‌కు చెందిన ఎస్‌సి ఇమాగో ర్యాంకింగ్ ఏజెన్సీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలను పరిశోధన ఆధారంగా మూల్యాంకనం చేసిందన్నారు. తాము అందించిన సేవలను గుర్తించారని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజాన సంస్థ ప్రపంచంలోని టాప్ పది స్థానాల్లో స్థానం సంపాదించిందని వివరించారు. ఇప్పటివరకు 3.41 కోట్ల మంది ప్రజలకు తమ సంస్థ సేవలు అందించిందని ఆయన వెల్లడించారు.
డీసీఎంగా ఎండీ ఆలీఖాన్ బాధ్యతల స్వీకారం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్ డీసీఎం (డివిజనల్ కమర్షియల్ మేనేజర్)గా ఎండీ ఆలీఖాన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన డివిజన్‌లోనే ఏసీఎం (అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్)గా విధులు నిర్వర్తిస్తూ డీసీఎంగా పదోన్నతి పొందారు. ఆయన 1989లో భారతీయ రైల్వేలో కమర్షియల్ అప్రెంటిస్ చేసి అనంతరం తెనాలి స్టేషన్ బుకింగ్ సూపర్‌వైజర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో గ్రూప్ బి ఆఫీసర్‌గా పదోన్నతి పొందాడు. ఆయన ఏసీఎంగా గుంతకల్లు, నాందేడ్, గుంటూరు డివిజన్‌లలో పనిచేసిన అనంతరం విజయవాడ డివిజన్‌కు బదిలీ అయ్యారు. తన కేరీర్‌లో ఉత్తమ సేవలకు గాను డీఆర్‌ఎం, పీసీసీఎం, జీఎం వంటి అనేక అవార్డులను అందుకున్నాడు.