
‘జీవో 282 రద్దు చేయాలి’
రెబ్బెన: వ్యాపార సముదాయాల్లో పనివేళలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 282 వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికుల వేతనాలు పెంచాలని ఎనిమిదేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనక్కి తగ్గి 12 గంటల పనివిధానం అమలు చేసేందుకు భయపడుతున్నాయని అన్నారు. కార్మిక సంఘాలన్ని జేఏసీగా ఏర్పడి కేంద్రంపై పోరాడుతుండగా జేఏసీలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘం కూడా ఉండి రాష్ట్రంలో కార్మికుల పనివేళలు పెంచడం సిగ్గుచేటన్నారు. దొడ్డిదారిన తీసుకువచ్చిన 282 జీవో వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో కార్మికులు శంకర్, రవి, గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.