
చేతులపై ఎత్తుకుని.. పట్టాలు దాటించి
రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని గంగాపూర్ రైల్వే గేట్‌ను మరమ్మతుల పేరుతో రైల్వే అధికారులు మూసివేయగా, శుక్రవారం ఓ రోగిని వారి బంధువులు చేతులపై ఎత్తుకుని ట్రాక్ దాటించారు. వివరాలు.. ట్రాక్ మరమ్మతుల కారణంగా మంగళవారం నుంచి గంగాపూర్ గేట్‌ను అధికారులు నాలుగు రోజులపాటు మూసివేశారు. ట్రాక్‌కు అవతలి వైపు ఉన్న 12 గ్రామ పంచాయతీల ప్రజలు మండల కేంద్రానికి వచ్చేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకుండా పోయింది. ప్రధానంగా రోగులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వాంకిడి మండలానికి చెందిన దుర్గం హేమరాజ్ రెబ్బెన మండలం నంబాలకు వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అతడికి యాక్సిడెంట్ కాగా అతడి సోదరుడు దుర్గం విశ్వనాథ్ తమ్ముడిని చూసేందుకు నంబాలకు వచ్చాడు. కొన్నిరోజులుగా తమ్ముడి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కసారిగా విశ్వనాథ్‌కు వాంతులు, భరించలేని కడుపునొప్పి రావడంతో బంధువులు హుటాహుటిన ఆటోలో గంగాపూర్ రైల్వేగేట్ వరకు తీసుకువచ్చారు. గేట్ మూసివేసి ఉండటంతో విశ్వనాథ్‌ను చేతులపై ఎత్తుకుని ట్రాకు దాటించి అక్కడి నుంచి వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడకముందే ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఈ నెల 2న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.