
రావి శ్రీనివాస్ సస్పెన్షన్ సరైన నిర్ణయమే..
● డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు
ఆసిఫాబాద్‌అర్బన్: ఆదివాసీ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదేనని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009, 2014, 2023లో పార్టీలు మారినా.. శ్రీనివాస్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీచేసి కనీసం జెడ్పీటీసీకి రావాల్సిన ఓట్లు కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. చిన్నారెడ్డి ఇచ్చిన నోటీసుకు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ జైనూర్‌లో గతంలో జరిగిన గొడవలకు మంత్రిని బాధ్యురాలిగా చేస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆదివాసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. వంజిరీ, అంకుసాపూర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతుల కోసం మంత్రిని రావి శ్రీనివాస్ అడిగారని, సీతక్క తిరస్కరించడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నార ని మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రమేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు మునీర్, మల్లేశ్‌యాదవ్, గుండా శ్యాం, చరణ్ పాల్గొన్నారు.