
జిల్లా కేంద్రంలో ఆదివారం
నిర్వహించే ప్రియాంకా గాంధీ
సభ కోసం ఏర్పాట్లు
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. అగ్రనేతలను రప్పించి సభలు నిర్వహిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇక సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు తరఫున ప్రచారం చేయడానికి యూపీ సీఎం యోగి ఈ నెల 25న ఆ నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు.
సీఎం ఆశీర్వాద సభలు..
బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం కేసీఆర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. అదేసమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే అనేకచోట్ల ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ నేతలు రోడ్‌షోలు.. సమావేశాలు మరిన్ని నిర్వహించనున్నారు.
కాంగ్రెస్‌లో జోష్
అధికార బీఆర్‌ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంకాగాంధీలు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, ఆసిఫాబాద్‌లో జరిగే బహిరంగ సభల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే కాంగ్రెస్ మరికొందరు స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించనున్నట్లు తెలిసింది. ఆసిఫాబాద్ పట్టణంలో ఆదివారం నలభై వేల మందితో నిర్వహించే బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారని పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్ ‘సాక్షి’కి తెలిపారు. సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల చరిత్ర తెలుసుకుని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్‌ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు
ఆసిఫాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సభాస్థలి ఏర్పాటుతోపాటు షామియానాలు, కుర్చీలు సిద్ధం చేస్తున్నారు. అన్ని మండలాల నుంచి పార్టీ అభిమానులు, ప్రజలను తరలించేందకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. సభాస్థలిని శనివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్, పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రియాంకా గాంధీ ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 9.40 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి ప్రత్యేక చాపర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ చేరుకుని, అక్కడ ఒంటి గంట వరకు బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
బీజేపీ తరఫున యోగి..
బీజేపీ తమ పార్టీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపుతోంది. సి ర్పూర్ నియోజకవర్గంలో డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. ఆయన తరఫున ఇప్పటికే మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చే స్తున్నారు. తాజాగా ఈ నెల 25న బీజేపీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్రీడామైదానంలో విజయ సంకల్పం పేరుతో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆయన పాల్వాయి హరీశ్‌బాబు విజయం కోసం కృషి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.