
పంపిణీకి సిద్ధంగా ఉన్న గిఫ్ట్ ప్యాక్‌లు
● జిల్లాకు చేరిన రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు ● 3,500 మంది ముస్లింలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ● ఇఫ్తార్ విందుకు రూ.7లక్షలు మంజూరు
ఆసిఫాబాద్‌అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కానుకలు జిల్లాకు చేరుకున్నాయి. ఈ ఏడాది జిల్లాకు ప్రభుత్వం 3,500 గిఫ్ట్ ప్యాక్‌లను కేటాయించింది. కాగజ్‌నగర్ డివిజన్‌కు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్‌లను కాగజ్‌నగర్ షాదీఖానాలో భద్రపర్చగా, ఆసిఫాబాద్ డివిజన్‌కు సంబంధించిన కానుకలను బాబాపూర్ సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నిల్వ ఉంచారు. ఈ నెలాఖరులోగా మండలాల వారీగా లబ్ధిదారులకు కానుకలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జిల్లాలో ఇఫ్తార్ విందుల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.7లక్షలు మంజూరు చేసింది.
త్వరలోనే మండల కేంద్రాలకు..
రాష్ట్ర ప్రభుత్వం ఏటా రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందజేస్తోంది. ఇందులో ఒక చీర, షర్వాన్, ఖమీజ్, కుర్తా, పైజామా ఉంటాయి. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తారు. జిల్లాకు రెండు నియోజకవర్గాలకు కలిపి 3,500 ప్యాక్‌లను కేటాయించారు. ఇందులో సిర్పూర్ నియోజకవర్గానికి 2,000, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 1,500 కానుకలు మంజూరు చేశారు. ఈ రంజాన్ తోఫాలను త్వరలోనే మండల కేంద్రానికి సరఫరా చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అలాగే ఇఫ్తార్ విందుల కోసం మొత్తం రూ.7లక్షలు మంజూరు చేయగా, ఇందులో సిర్పూర్ నియోజకవర్గానికి రూ.4లక్షలు, ఆసిఫాబాద్ డివిజన్‌కు రూ.3 లక్షల నిధులు వినియోగించనున్నారు. ఇఫ్తార్ విందులను ముస్లిం కమిటీలు సూచించే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.
నోడల్ అధికారి పర్యవేక్షణ..
రంజాన్ తోఫాల పంపిణీ బాధ్యతను ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకరి చొప్పున నోడల్ అధికారులను నియమించింది. అర్హులైన వారికి గిఫ్ట్ ప్యాక్‌లు అందేలా చూడాల్సిన బాధ్యత సదరు అధికారిపై ఉంటుంది. మండలాలకు తహసీల్దార్లు ఇన్‌చార్జీలు గా వ్యవహరిస్తారు. ముస్లింలకు త్వరలోనే రంజాన్ కానుకలను పంపిణీ చేస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి షేక్ మహమూద్ తెలిపారు.