
పక్కాగా లెక్క తేల్చేలా...
● పైలట్ ప్రాజెక్టుగా ములుగుమాడులో భూముల రీసర్వే ● గ్రామంలోని 103 సర్వే నంబర్లు, 845 ఎకరాల్లో సర్వేకు నిర్ణయం ● రేపటి నుంచి ఆరంభించనున్న సర్వేయర్లు
ఎర్రుపాలెం: కొన్ని గ్రామాల్లో లెక్కాపత్రం లేకుండా ఉన్న భూముల వివరాలను సర్వేనంబర్ల ఆధారంగా తేల్చాలని ప్రభుత్వం నిర్ణయింది. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో భూములకు సంబంధించి లెక్కల నిర్ధారణకు సర్వే చేయనున్నారు. ఈక్రమాన జిల్లాలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు కూడా ఎంపికైంది. ఈమేరకు ఉత్తర్వులు అందడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామానికి తూర్పున కట్లేరు, ఉత్తరాన ఇనగాలి, పడమర దిక్కున మధిర మండలం మాటూరు, దక్షిణాన సఖినవీడు రెవెన్యూ గ్రామాలను సరిహద్దులుగా గుర్తించారు.
ఇప్పుడు ఎందుకు..
గత ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌లు కావాల్సి ఉంది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఎంపిౖకైన ములుగుమాడులో 845ఎకరాల భూమి, 103 సర్వే నంబర్లు ఉన్నాయి. బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యాన సర్వేయర్లు సోమవారం నుంచి రీ సర్వే చేయనున్నారు. అన్ని రకాల భూములను సర్వే చేసి ప్రతీ కమతానికి నంబర్ కేటాయిస్తారు. అనంతరం పహాణీల్లో నంబర్లు, విస్తీర్ణంతో సరిపోల్చాక కలెక్టర్‌కు, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిస్తారు. కాగా, డ్రోన్లు, అత్యాధునిక పరికరాలతో సర్వే ద్వారా భూముల వివరాలు కచ్చితంగా నిర్ధారణ జరుగుతుందని భావిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే
భూముల రీ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ములుగుమాడు ఎంపికై ంది. సోమవారం నుండి గ్రామంలో భూముల సర్వే మొదలుకానుంది. క్షేత్రస్థాయిసర్వే ద్వారా ఏమైనా సరిహద్దు సమస్యలు ఉంటే తెలుస్తాయి. ఆపై భూముల చిత్రపటం
రూపొందిస్తారు. – ఎం.ఉషాశారద, తహసీల్దార్

పక్కాగా లెక్క తేల్చేలా...