
ఆదివాసీ సమాజంపై రాజకీయ కుట్రలు
ఇల్లెందు: రాజకీయ కుట్రలకు ఆదివాసీ సమాజం బలవుతోందని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు మైపతి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జన సభలో మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల గొంతు కోసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పడంలేదన్నారు. రాజకీయ పార్టీల కుట్రలను ఛేదించేందుకు ఆదివాసీలు అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొదెం వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు వంటివారు ఒక్కసారి కూడా శాసనసభలో ప్రశ్నించలేదని ఆరోపించారు. ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జేజే రాంబాబు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించామని, కేసు పెండింగ్‌లో ఉందని తెలిపారు. అంతకుముందు కొత్త బస్టాండ్ సెంటర్‌లో కొమరం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో ఆదివాసీ వేషధారణలతో కళా ప్రదర్శన నిర్వహించారు. సభలో కళాకారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్, నాయకులు కల్తీ సత్యనారాయణ, మెట్ల పాపయ్య, తెల్లం వెంకటేశ్వర్లు, జనార్దన్, పోలెబోయిన వెంకటేశ్వర్లు, చుంచు రామకృష్ణ, పొడియం బాలరాజు, బుగ్గ రామనాధం, జోగ రాంబ్రహ్మం పాల్గొన్నారు.
తుడుందెబ్బ నేత మైపతి అరుణ్‌కుమార్