
పశువుల అక్రమ రవాణా జరగకుండా కట్టడి
● జిల్లా సరిహద్దుల్లో ఏడు చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు
ఖమ్మంక్రైం: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గాను పోలీసులు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పోలీసు కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం జిల్లాలోని అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా పశువుల రవాణా విషయమై వివాదాలు తలెత్తకుండా చెక్ పోస్టులు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. సరైన వాహనాలు లేకుండా, చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, పండుగల వేళ మత సామరస్యానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేక సెల్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. కాగా, వైరా(పాలడుగు), బస్వాపురం క్రాస్(కొణిజర్ల), హనుమాన్ తండా(కల్లూరు), వెంకటగిరి క్రాస్ (ఖమ్మం రూరల్), సుబ్లేడ్ క్రాస్(తిరుమలాయపాలెం), సింగరేణి టోల్‌ప్లాజా(కూసుమంచి), వల్లభి(ముదిగొండ)ల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేయగా నిరంతరం గస్తీ కాయాలని సీపీ సూచించారు.