
భద్రాద్రి అభివృద్ధికి రూ.34 కోట్లు
● కొత్తగూడెంలో త్వరలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ● ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రేమ ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాపై అపారమైన ప్రేమ ఉందని.. అందుకే అడిగిందే తడవుగా ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బడ్జెట్‌తో పాటు ఈ బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ఆయకట్టుతోపాటు ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్టుతో సాధ్యమైందని, వచ్చే జూన్ నాటికి సత్తుపల్లి ప్రాంతంలో మరో 80వేల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని చెప్పారు. అలాగే, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.34కోట్లతో భూసేకరణ, ఇతర పనులు చేపట్టనున్నామన్నారు. అంతేకాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా సీఎం చొరవతో కొత్తగూడెంలో ఏర్పాటుకానుందని, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ కూడా ఏర్పాటైతే భద్రాద్రి ప్రాంతమంతా అభివృద్ధి జరుగుతుందని తుమ్మల అన్నారు. పాండురంగాపురం, విష్ణుపురం రైల్వేలైన్ ద్వారా సారపాక వరకు 16 కి.మీ. కనెక్టివిటీ ఇస్తే భద్రాచలానికి భక్తుల ప్రయాణం సులువు అవుతుందని వెల్లడించారు. ధంసలాపురం వద్ద ఫ్లై ఓవర్ పూర్తిచేసి ఖమ్మం–రాజమండ్రి జాతీయ రహదారిపై రవాణాను సుగమం చేసేందుకు వచ్చే ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర రూ.21 వేలకు చేరాలని అధికారులకు సూచించామని, ఉగాది సందర్భంగా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, నేలకొండపల్లి పాత రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారుల అథారిటీ నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు పాల్గొన్నారు.