
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
రఘునాథపాలెం: మండలంలోని పుటాని తండాలో విద్యుదాఘాతంతో శుక్రవారం మూడు ఆవులు మృతి చెందాయి. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన వశ్య, శంకర్, గుగలోతు రాంజ్యాకు చెందిన ఆవులను మేతకు విడిచారు. ఓ రైతు పొలంలోని 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకున్న ఆవులు అక్కడి ఎర్త్ పైపును తాకడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఏఈ సతీష్, లైన్ ఇన్‌స్పెక్టర్ దేవీలాల్, లైన్‌మెన్ ఎల్లయ్య చేరుకుని పరిశీలించగా, పశువైద్యాధికారి పోస్టుమార్టం చేశారు. ఈవిషయమై ఏడీ సంజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. గురువారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్ సమీపాన పిడుగు పడడంతో ఎర్త్ దెబ్బతిని ఉంటుందన్నారు. తెల్లవారుజామున 4నుండి 8గంటల మధ్య విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో మరమ్మతులు చేశామని, ఆతర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన చీకటి దీప్తి(28) గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈ నెల 14న ఆమెను తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన కలుపు మందు తాగింది. కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు సత్తుపల్లికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొబ్బరి చెట్లపై పిడుగులు
చింతకాని/కామేపల్లి: చింతకాని మండలంలోని జగన్నాధపురంలోని ఆలస్యం వెంకయ్య ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో చెట్టుపై 20 నిమిషాల పాటు మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వెంకయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్న కోలేటి రాంచందర్‌రావు గృహంలోని ఎలక్ట్రానిక్స్ సామగ్రి, వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే, కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని బండారి రామయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపైనా పిడుగు పడింది. అయితే, అంతసేపు రామయ్య ఆరు బయటే నిద్రించగా, వర్షం వస్తుండడంతో లోపలకు వెళ్లాడు. అదే సమయాన పిడుగు పడడంతో ప్రమాదం తప్పినట్లయింది.

విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి