
సమస్యల వలయంలో తారానాథ ఆస్పత్రి
సాక్షి,బళ్లారి: మొండి వ్యాధులను సైతం ఇట్టే నయం చేయడంలో రాష్ట్రంలోని పేరుగాంచిన ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఒకటైన బళ్లారిలోని తారానాథ ఆస్పత్రిని సమస్యలు చుట్టుముట్టాయి. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు కొరవడటం రోగులకు శాపంగా మారింది. ఈ ఆస్పత్రికి బళ్లారి జిల్లాతో పాటు, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు, ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తారానాథ ఆస్పత్రిలో ఆయుర్వేద కళాశాల కూడా ఉంది. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, మరో వైపు వైద్య సేవలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. సిబ్బంది కొరతపై పలుమార్లు అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏటేటా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. బోధన సిబ్బంది 52 మంది ఉండాల్సి ఉండగా, అందులో సగం కూడా వైద్య సిబ్బంది లేరు. ఫలితంగా ఇటు వైద్య సేవలు, అటు బోధన సేవలు రెండింటికీ సమస్యగా పరణమించింది. 20 మందికి పైగా నర్సులు అవసరం ఉండగా,13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది కొరతతో ఒక్కోసారి నర్సుల పని కూడా తామే చేయాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక విధానం ద్వారా మసాజ్ చేయడంతోపాటు, స్టీం బాత్ సౌకర్యంకూడాఉంది. వనమూలికలతో తయారు చేసిన మందులతో పలు నొప్పులకు మసాజ్ చేసిన తర్వాత స్టీం బాత్ చేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. పక్షవాత బాధితులకు మసాజ్ చేసి చికిత్సలు చేస్తుంటారు ఆస్పత్రిలో విద్యుత్ సమస్య కూడా ఉంది. జనరేటర్ సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యుత్‌కోతల సమయంలో రోగులు ఇబ్బందులు పడుతుంటారు.
సిబ్బంది కొరతతో రోగులకు ఇక్కట్లు
విద్యుత్ కోతలు ..జనరేటర్ అంతంత మాత్రమే

సమస్యల వలయంలో తారానాథ ఆస్పత్రి

సమస్యల వలయంలో తారానాథ ఆస్పత్రి