
సమాజానికి పాత్రికేయుల సేవలు అపారం
హొసపేటె: స్థిరమైన సమాజాన్ని నిర్మించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొప్పళ గవి మఠం జగద్గురు అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామీజీ అన్నారు. నగరంలోని సాయిలీల కళా మందిరంలో కర్ణాటక యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల దినోత్సవం, ప్రతిభా పురస్కారం, సీనియర్ విలేకరులకు సన్మానం కార్యక్రమంను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలను కొనుగోలు చేసి చదివే వారి సంఖ్య తగ్గుతోందన్నారు. జిల్లాధికారి దివాకర్ మాట్లాడుతూ విలేకరులు సమాజంలో ఉన్న ఒడిదొడుకులను అధికారుల దృష్టికి తీసుకురావడంలో విలేకరుల పాత్ర కీలకమని తెలిపారు. ఎమ్మెల్యే గవియప్ప మాట్లాడుతూ పాత్రికేయుల నూతన భవన నిర్మాణం చేపడుతామన్నారు. అనంతరం పది, పీయూసీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ. పది వేలు చొప్పున నగదును జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ తరఫున ఆయన పీఏ లక్ష్మీ నారాయణ అందజేశారు. జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూర్, కార్యదర్శి లోకేష్, ఎస్పీ శ్రీ హరిబాబు, హుడా అధ్యక్షులు ఇమామ్, నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్, జిల్లాధ్యక్షుడు సత్యానారాయణ, కార్యదర్శి లక్ష్మణ, వెంకోబి తదితరులు పాల్గొన్నారు.