
సిద్దుకు పదవిపై గందరగోళం!
దొడ్డబళ్లాపురం: ఏఐసీసీ ఓబీసీ జాతీయ విభాగంలో సీఎం సిద్దరామయ్య నియామకం గురించి కొంత గందరగోళం అలముకొంది. ఆయన అందులో సభ్యునిగా ఉండగా, ఇప్పుడు అధ్యక్షున్ని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆదివారం సీఎం మాట్లాడుతూ జూలై 15న ఓబీసీ సభను నిర్వహించాలని తనకు సూచించారన్నారు. అధ్యక్ష పదవి గురించి సమాచారం లేదన్నారు.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ స్పష్టతనిస్తూ మండలిలో సీఎం సిద్ధరామయ్య సభ్యుడు మాత్రమేనని, అధ్యక్షునిగా డా.అనిల్ జైహింద్ ఉన్నారని, ఆయన నేతృత్వంలోనే 15న బెంగళూరులో ఓబీసీ సభ జరుగుతుందని తెలిపింది. ఆ భేటీకి వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది వరకూ ముఖ్య నేతలు హాజరవుతారు.
కెనాల్‌లోకి బైక్ పల్టీ,
ఇద్దరు జలసమాధి
మండ్య: బైక్ అదుపుతప్పి విశ్వేశ్వరయ్య కెనాల్ (వీసీ)లో పడడంతో ఇద్దరు మరణించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని హోసగావి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాకు చెందిన రామన్న (70), మద్దూరువాసి భరత్ (19), ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మోపెడ్‌లో వెళ్తున్నారు. బైకు నడుపుతున్న రామన్న అదుపు తప్పడంతో అడ్డుగోడను ఢీకొని కాలువలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో పాటు గాయాల పాలై అక్కడే చనిపోయారు. సాయంత్రం కొందరు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.
అన్నదాత ఆత్మహత్య
మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని బిలికెరె హోబ్లిలోని శ్రావణహళ్లి గ్రామంలో అప్పుల బాధతో రైతన్న ప్రాణాలు తీసుకున్నాడు. పుట్టస్వామాచారి (50) అనే రైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. పొగాకు, ఇతర పంటల సాగు కోసం రూ. 20 లక్షల అప్పులు తీసుకొన్నాడు. మైక్రో ఫైనాన్స్ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకొన్నాడు. కొన్నిరోజులుగా రుణదాతలు రైతు ఇంటికి వచ్చి చెల్లించాలని గొడవలు చేయడంతో విరక్తి చెందాడు. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు మైసూరులోని కేఆర్ నగర ఆస్పత్రిలో చేర్పించగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.