
తీర జిల్లాల్లో తగ్గని వానలు
యశవంతపుర: కోస్తా జిల్లాలలో భారీ వానలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో అనేక నదులు భారీగా ప్రవహిస్తున్నాయి. చిక్కమగళూరు జిల్లా బాళెహొన్నూరు, కళస, కొప్ప, మూడిగెరె, ఎన్‌ఆర్‌పురలో భారీగా వానలు పడుతున్నాయి. చెరువు, కుంటలు నిండిపోయాయి. చార్మాడి ఘాట్ రోడ్డులో జలపాతాలు మొదలయ్యాయి. ఎత్తైన కొండల నుంచి వాననీరు ఉవ్వెత్తున దూకుతోంది. గాలీవానకు ఆదివారం ఉదయం కారవారలో సుభాష్ సర్కిల్‌లో స్కూటరిస్టుపై చెట్టు పడిపోయింది. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలు తగిలాయి. ప్రాణాపాయం నుంచి బయటపడింది.
కృష్ణా, ఉపనదులు తీవ్రం
బయలుసీమ జిల్లాలైన తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామాంతర, మండ్య, మద్దూరు, చిత్రదుర్గ, దావణగెరెలో ఆకాశం మేఘావృతమైంది. మహారాష్ట్ర, పశ్చిమ కనుమలలో వర్షాల వల్ల బెళగావి ప్రాంతంలో కృష్ణాతో పాటు ఉపనదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిలో 1.06 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వేదగంగా, దూద్‌గంగా నదులు నిండి జోరందుకున్నాయి. వీటి కింది ఉన్న 8 జలాశయాలు పూర్తిగా నిండిపోగా, పరిసరాల్లో ఆలయాలు నీట మునిగాయి.
బెంగళూరులో జల్లు వాన
బనశంకరి: ఆదివారం బెంగళూరు నగరంలో కొన్నిచోట్ల జల్లులతో కూడిన వర్షం కురిసింది. వీకెండ్ మోజులో ఉన్న నగరవాసులకు బ్రేక్ ఇచ్చింది. జక్కూరు, చౌడేశ్వరినగర, విజ్ఞాననగర, అగర, హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్, కోరమంగల, ఆర్‌ఆర్ నగర, సంకేనహళ్లి, సంపంగి రామనగర, రాజగోపాల నగర, కేఆర్.పురం, కొడిగేహళ్లి, బాణసవాడి, జ్ఞానభారతి, హెమ్మెగెపుర తదితర 81 వార్డుల్లో జల్లు వర్షం కురిసింది.