
బళ్లారిలో కసాప సమ్మేళనంతో కొత్త చరిత్ర
బళ్లారిటౌన్: బళ్లారిలో త్వరలో జరిగే 88వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం చరిత్ర సృష్టించనుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులోని కసాప కార్యాలయంలో జరిగిన ముందస్తు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కన్నడిగులు గర్వించదగ్గ ఉత్సవం అని, అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా సన్నద్ధం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన అన్ని సదుపాయాలకు ఆర్థిక సహాయం అందజేయనుందన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు, నాడోజ మహేష్ జోషి మాట్లాడుతూ బళ్లారి జిల్లాలో ఇంత వరకు 5 సమ్మేళనాలు జరిగాయని, ఇది 6వ సమ్మేళనం అన్నారు. స్వాతంత్య్ర అనంతరం రెండో సమ్మేళనం అని గుర్తు చేశారు. ఇప్పటికే బళ్లారిలో కసాప కార్యవర్గ సమితి సమావేశంలో అఖిల భారత కసాప సమ్మేళన అధ్యక్షురాలిగా బాను ముస్తాక్‌ను ఎంపిక చేశారని, ఈమె మొదటి మైనార్టీ మహిళ అని గుర్తు చేశారు. జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, కేంద్ర కసాప కార్యదర్శి బీఎం పాటిల్, మాధ్యమ కన్వీనర్ హెచ్.శ్రీధర్‌మూర్తి, జిల్లా ఎస్పీ శోభారాణి, మహమ్మద్ హ్యారీష్ తదితరులు పాల్గొన్నారు.