
కరావళి, మలెనాడులో కుంభవృష్టి
బనశంకరి: కరావళి, మలెనాడు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి, హొసనగర, సాగర తాలూకాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
కొడగుకు భారీ వర్ష సూచన
కొడగు జిల్లాలో భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వంకలు, వాగులు ఏరులై ప్రవహిస్తున్నాయి. నదుల్లో నీటిమట్టం పెరిగింది. జనజీవనం స్తంభించింది. అంగన్‌వాడీ, పాఠశాలలు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. చిక్కమగళూరు జిల్లాలోని 5 తాలూకాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్‌ఆర్‌పుర, కొప్ప, శృంగేరి, కళస, మూడిగెరె తాలూకాల్లో అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లాధికారి మీనా నాగరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో కారవార తాలూకా కద్ర సమీపంలో కొడసహళ్లి ఆనకట్టకు వెళ్లే రోడ్డులో గురువారం భారీ వర్షాలతో కొండచరియ విరిగిపడింది. ఘటనాస్థలానికి అధికారులు వెళ్లి పరిశీలించి జేసీబీలతో మట్టిని తొలగిస్తున్నారు. ముంగారు వర్షాల నేపథ్యంలో కళ్యాణ కర్ణాటక జీవనాడి తుంగభద్రా జలాశయం నిండుతోంది. జలాశయంలోకి భారీ స్థాయిలో నీరు చేరింది. 80 టీఎంసీల నీరు నిల్వ చేరింది. 34 వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరిగింది. 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
దక్షిణ కన్నడలోనూ వర్షాలు
దక్షిణకన్నడ జిల్లా సుబ్రమణ్య, కడబ, సుళ్య తాలూకా కుక్కే సుబ్రమణ్యలో వర్షాలు కొనసాగుతున్నాయి. కుక్కే సుబ్రమణ్యలో కుమారధార స్నానఘట్టం నీట మునిగిపోయింది. వర్షాల నేపధ్యంలో కడబ, సుళ్య తాలూకాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ప్రకటించారు. కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన, బెళగావి, ధారవాడ, హావేరి జిల్లాలకు ఎల్లోఅలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 6 రోజుల వరకు మబ్బులతో కూడిన వాతావరణం ఉండగా, సాధారణ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రదేశాల్లో వర్షం కంటే గాలి వేగం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
విరిగి పడుతున్న కొండచరియలు
నీట మునిగిన కుమారధార స్నానఘట్టం
జనజీవనం అస్తవ్యస్తం
పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి

కరావళి, మలెనాడులో కుంభవృష్టి