● ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ శివార్లలో జాతీయ రహదారి–50లోని జెస్కాం కార్యాలయం ముందు కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరు స్థలంలోనే మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. బాగల్‌కోటె జిల్లాలోని శెట్టిహాళు గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ ముత్తప్ప పూజార్(35), అతని భార్య రేణుక(30), పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
తల్లీకుమారుల అదృశ్యం
హొసపేటె: నగరంలోని 22వ వార్డు ఆశ్రయ కాలనీలో తల్లీకుమారులు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ముంతాజ్‌బేగం(42), ఆమె కుమారుడు వసీం అక్రం(13) గత నెల 13న తప్పిపోగా, మహిళ తెలుపు రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి, గుండ్రని ముఖం, 5.1 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు కలిగి కన్నడ, ఉర్దూలో మాట్లాడుతుంది. గోధుమ, తెల్ల రంగు పూల డిజైన్ చీర ధరించింది. ఆమె వీపుపై కుడి వైపున ఒక నల్లటి మచ్చ ఉంది. తప్పిపోయిన బాలుడు తెలుపు రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి, నీలి రంగు ముఖం, 4.1 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు కలిగి, కన్నడ, ఉర్దూలో మాట్లాడతాడు. అతను తెల్లటి టీ షర్టు, నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతిపై నల్లటి మచ్చ ఉంది. తప్పిపోయిన తల్లీ కుమారుల ఆచూకీ ఏమైనా తెలిస్తే హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ లేదా 9480807700 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
నాణ్యతగా నిర్మాణ
పనులతోనే జాప్యం
బళ్లారి అర్బన్: నగరంలో ప్రగతి పథంలో సాగుతున్న వివిధ నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం జరగడం లేదని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే సమయం పడుతోందని, ఈ విషయంలో విపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. గాంధీనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఏ పనులు కూడా కావాలని ఆలస్యం చేయడం లేదన్నారు. అన్నీ అనుకున్న గడువులోనే పూర్తి చేస్తామన్నారు. సుధా క్రాస్ రైల్వే వంతెన పనులు నిలిచి పోయాయన్నారు. ఆ ప్రాంత వాసులు కోర్టును ఆశ్రయించడంతోనే తాత్కాలికంగా పనులను నిలిపి వేశారన్నారు. ఈ విషయంలో పూర్తి వివరాలు రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల గురించి స్పందించిన ఆయన సీఎం, కేపీసీసీ అధ్యక్షుల గురించి మాట్లాడేంత స్థాయికి తాను ఇంకా ఎదగలేదన్నారు. అలాగే ఏ మంత్రి పదవిని తాను కోరుకోలేదన్నారు. ఒకటి, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశించడం సరికాదన్నారు.
ఇంట్లో చోరీకి దొంగల యత్నం
హొసపేటె: దొంగలు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించిన ఘటన విజయనగర జిల్లా హొసపేటెలోని సంక్లాపురలో జరిగింది. దొంగల కదలికలు అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పద్మావతి అనే మహిళకు చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి యత్నించినా ఎలాంటి విలువైన వస్తువులు లేదా డబ్బు కనిపించక పోవడంతో వట్టి చేతులతో వెనుతిరిగారు. హొసపేటె రూరల్ స్టేషన్ పోలీసులు ఇంటిని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరుగుదొడ్లు నిర్మించరూ
రాయచూరు రూరల్: నగరంలో మరుగుదొడ్లు నిర్మించాలని దళిత మౌళిక సౌకర్యాల హక్కుల పోరాట సమితి సేవకుడు శరణ బసవ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. దేవినగర్, బుద్ధనగర్ మురికి వాడల్లో 1200 మంది పేద కార్మికులు నివసిస్తున్నారని, కనీసం 5 చోట్ల మరుగుదొడ్లు నిర్మించి నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ నగరసభ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
కారు లారీని ఢీకొని దంపతుల మృతి
కారు లారీని ఢీకొని దంపతుల మృతి
కారు లారీని ఢీకొని దంపతుల మృతి
కారు లారీని ఢీకొని దంపతుల మృతి