
కళలు, కళాకారులను కాపాడుకోవాలి
బళ్లారి అర్బన్: కళలు, కళాకారులను పరిరక్షించుకొని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హచ్చొళ్లి వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ హెచ్‌కే.సిద్దయ్య స్వామి పేర్కొన్నారు. సిరుగుప్ప తాలూకా కుడుదరహాళ గ్రామం దేవి పుణ్య ఆశ్రమం, ఎళెవాళ సిద్దయ్య స్వామి బయలురంగ మందిరంలో హంద్యాళ మహాదేవ తాత కళా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన నాటక హబ్బ–2025 సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేడు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని చాలా మంది కలలు కంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత యువతలో కళలు, సంస్కృతిని పరిరక్షించడంలో మహాదేవతాత కళా సంఘం కృషి ప్రశంసనీయం అన్నారు. ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్ కళాకారుడు పురుషోత్తం హంద్యాళ్ మాట్లాడుతూ మానవ సంబంధాలు జీవితంలో అవిభాజ్య అంగం అన్నారు. మానసిక భావనాత్మక యోగ క్షేమాలు, పరస్పర సహకారంతో జీవితం నిర్వహణకు సంబంధాలు చాలా ముఖ్యం అన్నారు. ఆశ్రమ పీఠాధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ తాతతో సంబంధాలు స్వచ్ఛంద అవగాహన, వ్యక్తిత్వ ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. కార్యక్రమంలో కుమార్ ప్రసాద్ సంగీతం అందించగా, సిరిగేరి ధాత్రి రంగ సంస్థ కళాకారుల బృందం సంబంధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రముఖులు బీ.వెంకటేష్, కాసింసాబ్, జ్ఞానరెడ్డి, పాలాక్షి గౌడ, బుశప్ప తదితరులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కళలు, కళాకారులను కాపాడుకోవాలి