
తుంగ..భద్ర గలగలా పరవళ్లు
యశవంతపుర/ శివమొగ్గ: కరావళి– మలెనాడు ప్రాంతాలలో భారీగా వానలు పడుతున్నాయి. తుంగానదీ నీటి మట్టం విపరీతంగా పెరిగింది. చిక్కమగళూరు జిల్లా శృంగేరి కెరెకట్ట ప్రాంతంలో పడుతున్న వానలతో శృంగేరి శారద మఠం గాంధీ మైదానం నీటితో నిండిపోయింది. ముందు జాగ్రత్తల్లో భాగంగా బ్యారికేడ్‌ను వేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. ఎడతెరిపిలేని వానలతో తుంగా నదీ అపాయకర స్థాయిలో ప్రవహిస్తోంది. కళస తాలూకా చన్నహడ్లు గ్రామం వద్ద మట్టి చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. హిరైబెలు మల్లేశనగుడ్డతో పాటు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలో కొప్ప, శృంగేరి, ఎన్‌ఆర్‌పుర, మూడిగెరె తాలూకాలలో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అహితకర ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు చర్యలను చేపట్టారు. 8 జిల్లాల వ్యాప్తిలో శనివారం రాత్రి వరకు భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, హాసన్, కొడగు, శివమొగ్గ, బెళగావి జిల్లాల పరిధిలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. శివమొగ్గ జిల్లాలో బడులకు సెలవులిచ్చారు. తుంగ, భద్ర నదులు కలిసి మరింత ఉధృతరూపం దాల్చాయి.
పోటెత్తిన తుంగా నది
పరివాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తున్న కారణంగా శివమొగ్గ తాలూకాలోని గాజనూరులోని తుంగా జలాశయం ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. ఆనకట్ట ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకొన్నందున నీటిని భారీగా వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 77 వేల క్యూసెక్కుల వదిలినట్లు ఆనకట్ట ఇంజనీర్ తిప్పనాయక్ తెలిపారు. దీంతో దిగువన తుంగా నది పోటెత్తుతోంది. నీటి విడుదల వల్ల శివమొగ్గ నగరం గుండా వెళ్లే తుంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కోర్పలయ్య గుడిసె దగ్గర ప్రమాద స్థాయిని ప్రదర్శించే కట్ట మీదుగా నీరు వెళ్తోంది. లోతట్టు ప్రాంతాలలోకి నీరు చొరబడే ప్రమాదం ఉంది, నీరు చేరికతో తుంగభద్ర నది జోరు మీదుంది.
శివమొగ్గ వద్ద తుంగ డ్యాం నుంచి భారీగా నీటి విడుదల
తుంగా డ్యాం నుంచి 77 వేల క్యూసెక్కుల విడుదల

తుంగ..భద్ర గలగలా పరవళ్లు

తుంగ..భద్ర గలగలా పరవళ్లు