
బస్సు పల్టీ.. 25 మందికి గాయాలు
మండ్య: వేగంగా వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట పొలంలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో సమారు 25 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మండ్య తాలూకాలోని శివళ్ళి, హాడ్యా గ్రామాల మధ్య జరిగింది. మండ్య నుంచి శివళ్ళి మీదుగా పాండవపురకు వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. స్థానికులు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
నకిలీ హెల్మెట్లపై కొరడా
దొడ్డబళ్లాపురం: ఊరూ పేరూ లేని నకిలీ హెల్మెట్లు, నాసిరకం హెల్మెట్లను అమ్ముతున్న షాపులపై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులో శనివారంనాడు 19 చోట్ల తనిఖీలు చేసి, 6 దుకాణదారులకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించారు. సిద్ధయ్య రోడ్డు, కలాసిపాళ్య, లాల్ బాగ్ రోడ్డు, మాగడి రోడ్డు, సుమనహళ్లి, విజయనగర, దాసరహళ్లి, నాగరభావి, ఔటర్ రింగ్ రోడ్డుల్లో దాడులు చేపట్టారు. నోటీసులు ఇచ్చి కోర్టులో జరిమానా కట్టాలని సూచించారు. పెద్దసంఖ్యలో నకిలీ హెల్మెట్ల స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ హెల్మెట్‌లు ధరించిన 38 బైకిస్టులకు కూడా జరిమానాలు వేశారు. సగం హెల్మెట్‌లు, ఐఎస్‌ఐ మార్కులేని హెల్మెట్‌లు ఉపయోగిస్తున్నవారికి కూడా ఫైన్ వేశారు.
తుపాకీతో ఎమ్మెల్యే పుత్రుని హల్‌చల్
దొడ్డబళ్లాపురం: జాతరలో పోలీసుల ముందే ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా లక్ష్మిదేవి జాతరలో చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళి కుమారుడు సంతోష్ జార్కిహొళి కాల్పులు జరిపాడు. జాతరలో సంతోష్ కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకుని పిస్టల్ తీసి గాల్లోకి కాల్చాడు. కాల్పుల శబ్ధాలకు జనం భయపడిపోయారు. ఈ దృశ్యాలు వైరల్ కాగా, అతని అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ముందు కాల్పులు జరిపినా వారు పట్టించుకోలేదని, శాంతిభద్రతలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నించారు.

బస్సు పల్టీ.. 25 మందికి గాయాలు