
బాలున్ని కిడ్నాప్ చేసి హత్య
కెలమంగలం: పాఠశాలకు వెళ్లిన 13 ఏళ్ల బాలున్ని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం తమిళనాడులోని క్రిష్ణగిరి తాలూకా కేంద్రం అంచెట్టి సమీపంలో జరిగింది. అంచెట్టి సమీపంలోని మావనట్టి గ్రామంలో శివరాజ్, మంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రోహిత్(13)అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు అదే ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం బాలుడు పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని సీసీటీవీ కెమెరా పుటేజ్‌లను పరిశీలించారు. కొందరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసినట్లు కనిపించగా అంచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వరకు బాలుడి జాడలేదు. పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌ష్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. కాగా అంచెట్టికి ఐదు కిలోమీటర్ల దూరంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా రోహిత్ విగతజీవిగా కనిపించాడు. బాలుడు హత్యకు గురైనట్లు నిర్ధారించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అదే ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా కారు కనిపించగా సోదా చేశారు. బాలుడి కిడ్నాప్‌నకు ఈ కారు ఉపయోగించినట్లు తేలింది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజు పరిశీలించారు. బాలుడి హత్యకు కారణాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా అంచెట్టి సమీపంలో ఘోరం

బాలున్ని కిడ్నాప్ చేసి హత్య