
రైతుల భూములు లాక్కోవడం అన్యాయం
బనశంకరి: దేవనహళ్లి చుట్టుపక్కల 13 గ్రామాల రైతుల 1,777 ఎకరాల భూములను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రైతులు చేపట్టిన పోరాటానికి సాహితీవేత్తలు, కన్నడ సినీ రంగం కళాకారులు, రైతు ఉద్యమనాయకుడు రాకేష్ టికాయత్, దర్శన్‌పాల్, సామాజిక కార్యకర్త హీరేమఠ్ తదితర ప్రముఖులు మద్దతు పలికారు. ధర్నానుద్దేశించి సాహితీవేత్త రహమత్ తరీకెరె మాట్లాడుతూ ఇది రైతుల పోరాటం మాత్రమే కాకుండా కన్నడిగుల పోరాటమన్నారు. రైతులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వీటిపై చర్చించకుండా భూమి ఎలా లాక్కోవాలని ఆలోచిస్తుందని ప్రశ్నించారు. ఈనెల 4న రైతుల తరఫున తీర్మానం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటుడు కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ దందా జరుగుతోందన్నారు. అన్నదాతపై దాడి చేసి చిన్న రైతుల చేతిలో ఉన్న భూమిని లాక్కుంటున్నారన్నారు. రైతుల భూములను పరిశ్రమలకు ఇవ్వడం కుదరదన్నారు. రచయిత కవిరాజ్ మాట్లాడుతూ రైతుల భూమిని లాక్కోవడం సరికాదన్నారు. ఇది కార్పొరేట్ లాబీ అని తెలుస్తోందని, దీనిపై తీవ్రపోరాటం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పోరాటదారులు శివసుందర్, సాహితీవేత్తలు కేపీ.సురేశ్, వీరసంగయ్య, బీటీ.లలితానాయక్, నూర్‌శ్రీధర్, వీ.నాగరాజ్, గురుప్రసాద్ కెరగోడు, బడగలపుర నాగేంద్ర, కేవీ.భట్, డైరెక్టర్ రాజేంద్రసింగ్‌బాబు, టీఎన్.సీతారాం, నాగతిహళ్లి చంద్రశేఖర్, విజయలక్ష్మీ సింగ్, గిరీశ్ కాసరవళ్లి, నటుడు ప్రకాష్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలకు మద్దతు పలికిన
సాహితీవేత్తలు, సినీ కళాకారులు

రైతుల భూములు లాక్కోవడం అన్యాయం