
హాసన్‌లో హృదయ వేదన
బనశంకరి: హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు ఆగకపోగా, ప్రజల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకే రోజు నలుగురు మరణించారు. దీంతో గత 40 రోజుల్లో గుండెపోటుకు బలైనవారి సంఖ్య 22 కు పెరిగి భీతావహం నెలకొంది. బేలూరులో జేపీ లేపాక్షి (50) అనే మహిళ, హొళెనరసీపుర ప్రభుత్వ పీయూ కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ ముత్తయ్య (58), నుగ్గేహళ్లి నాడకచేరి డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ (53), చెన్నరాయపట్టణ తాలూకా కెంబాళు గ్రామంలో లోహిత్ (38) అనే జవాన్ గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు.
అయ్యో.. సైనికుడు
● లోహిత్ గత 18 ఏళ్లుగా ఆర్మీ జవాన్‌గా పనిచేస్తుండగా సెలవుల్లో ఊరికి వచ్చారు. జూలై 3 నాటికి సెలవు పూర్తయి డ్యూటీకి వెళ్లాలి. కానీ సోమవారం ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చి ప్రాణాలు వదిలాడు.
● చెన్నరాయపట్టణ తాలూకా నుగ్గేహళ్లి గ్రామ నాడ కచేరి డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుండె నొప్పి అనిపించింది. వెంటనే కుటుంబీకులు చెన్నరాయపట్టణ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
బెంగళూరులో మెడికో
మరోవైపు బెంగళూరులో మెడికల్ విద్యార్థి వైభవ్ కులకర్ణి (26) గుండెపోటుతో మృతిచెందారు. బాగల్‌కోటేలో వీవీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. స్నేహితులతో కలిసి తమిళనాడు టూర్‌కి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బెంగళూరుకు రాగానే గుండెపోటు పట్టేయడంతో అతడిని ఓ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ చనిపోయాడు.
పరిశోధిస్తాం: సీఎం
హాసన్ జిల్లాలో గుండెపోటు మరణాల గురించి మైసూరులో ఉన్న సీఎం సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడారు. దీనిపై పరిశీలన చేస్తున్నామని, కారణాలు ఏమిటి అనేది నిపుణుల ద్వారా తెలుసుకుంటామన్నారు. ఆరోగ్యశాఖ జయదేవ హృద్యోగ సంస్థకు చెందిన 10 మంది వైద్యనిపుణులతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయనుంది. హాసన్‌లో మరణాలు, కారణాలపై విచారణ జరుపుతారు.
మరో నలుగురు ఆకస్మిక మృతి
మృతుల్లో లెక్చరర్, ఉద్యోగి, జవాన్

హాసన్‌లో హృదయ వేదన

హాసన్‌లో హృదయ వేదన