
విద్యుదాఘాతానికి దంపతులు బలి
బొమ్మనహళ్లి: విద్యుదాఘాతానికి దంపతులు బలైన ఘటన శివమొగ్గ జిల్లా సొరబ తాలూకా కప్పగళలె గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలో కృష్ణప్ప(50), వినోద(42) దంపతులు నివాసం ఉంటున్నారు. వినోద గురువారం రాత్రి సమారు 7 గంటల సమయంలో ఉతికిన దుస్తులను ఇంటి వెనుక వైర్లపై ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఇంట్లో ఉన్న భర్త కృష్ణప్ప పరుగు పరుగున వెళ్లి భార్యను కాపాడేందుకు యత్నించగా అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఘటన స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. ఇంటి విద్యుత్ కనెక్షన్ ఇన్సులేటర్ వైర్ జీవైర్‌ను తాకడంతో ఈఘటన జరిగినట్లు చెబుతున్నారు. సొరబ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పిచ్చికుక్క స్వైర విహారం
●చిన్నారులు సహా 20 మందికి గాయాలు
మైసూరు: పిచ్చి కుక్క స్వైర విహారం చేయడంతో 20 మంది గాయపడ్డారు. ఈఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హుల్లహళ్లి గ్రామంలో జరిగింది. గురువారం సాయంత్రం చిన్నారులు పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో బస్టాండు, డబల్ రోడ్డు తదితర చోట్ల్ల పిచ్చికుక్క దాడికి పాల్పడింది. చిన్నారులు భయంతో పరుగులు తీయగా వెంటాడి అందిన చోటల్లా కరిచింది. చిన్నారులను కాపాడేందుకు వెళ్లిన వారిపై కూడా కుక్క దాడి చేసింది. గాయపడిన నిశ్చిత్(4), అనిత(35), వినోద(18), గిరీష్(12), ఆంజలి(10), ధనుష్(5), రవికుమార్ (12) ఆర్మాన్ (3), సవిత(37), గిరిష్(40), ఉసబ్‌ఖాన్(7) కాళస్వామి(36)తోసహా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారు. రేబిస్ సోకకుండా ఇంజక్షన్లు వేశారు.
సినీ ఫక్కీలో
రూ.2 కోట్ల దోపిడీ
యశవంతపుర: పట్టపగలే సినీ ఫక్కీలో రూ.2 కోట్ల నగదును దోచుకెళ్లిన ఘటన బెంగళూరు విద్యారణ్యపుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఎస్ పాళ్య వద్ద జరిగింది. కెంగేరికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీహర్ష పరిశ్రమల కోసం యంత్రాలను జర్మనీ నుంచి కొనుగోలు చేయటానికి రూ.2 కోట్లను యూఎస్‌డీఐటీకి కన్వర్ట్ చేసువాల్సి ఉంది. డబ్బు కన్వర్ట్ చేయడానికి ఎం.ఎస్.పాళ్య వద్దకు రావాలని స్నేహితుడి ద్వారా పరిచయమైన బెంజమిన్ సూచించగా శ్రీహర్ష ఈ నెల 25న మధ్యాహ్నం వెళ్లాడు. అక్కడ గదును లెక్కిస్తుండగా ఒక్కసారిగా అంగడిలోకి చొరబడిన 6–7 మంది దుండగులు కత్తులు చూపించి శ్రీహర్షపై దాడి చేశారు. శ్రీహర్ష, బెంజమిన్, అతడి స్నేహితులను గదిలో బంధించి నగదుదో ఉడాయించారు. గది తలుపును బద్దలు కొట్టి బయటకు వచ్చిన బెంజమిన్, అతని స్నేహితులు మాయమయ్యారు. దిక్కుతోచక బాధితుడు శ్రీహర్ష విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంజమిన్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

విద్యుదాఘాతానికి దంపతులు బలి