
దర్వేశ్ ఆస్తుల జప్తుకు సూచన
రాయచూరు రూరల్: నగరంలో అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి రూ.900 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన దర్వేశ్ కంపెనీ ఆస్తులను జప్తు చేయాలని రెవెన్యూ శాఖ ఉప కార్యదర్శి అన్వర్ పాషా రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి డిపాజిట్ల పేరుతో అధిక శాతం వడ్డీ ఇస్తామని ఏజెంట్ల నుంచి తెచ్చుకున్న డబ్బులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి ఆస్తులను స్వాధీనపరచుకోవాలని సూచించారు. దర్వేశ్ బ్యాంక్ ఖాతాలోని డబ్బును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుజాతో పాటు 22 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలను జప్తు చేశారు. మహీంద్ర, స్కార్పియో, క్రెటా, సోనెట్‌లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
తాగునీరు అడిగినందుకు దాడి
రాయచూరు రూరల్: గ్రామంలో కొళాయిలకు తాగునీరు విడుదల చేయరా? అని ప్రశ్నించినందుకు దాడి చేసిన ఘటన జిల్లాలోని సిరవార తాలూకాలో చోటు చేసుకుంది. గురువారం తాలూకాలోని బాగలవాడలో జీపీ అధ్యక్ష స్థానం అలంకరించిన తిప్పణ్ణను గత వారం రోజుల నుంచి కొళాయిల్లో తాగునీరు రావడం లేదని బసప్ప అనే వ్యక్తి ప్రశ్నించినందుకు తిప్పణ్ణ మద్దతుదారులు బసప్పపై దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
గుంతకల్లులో రాయచూరు జిల్లా వాసి బలవన్మరణం
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే పార్సిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్‌లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గుడదనాళకు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.
జొన్నల డబ్బులు చెల్లించండి
రాయచూరు రూరల్: కర్ణాటక వ్యవసాయ మండలి రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నిరుపాది మాట్లాడారు. నాలుగు నెలల క్రితం రైతులు విక్రయించిన జొన్నలకు ఇంకా అధికారులు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. మిగిలిన జొన్నల కొనుగోళ్ల గడువును 15 రోజుల పాటు విస్తరించాలని, బకాయి ఉన్న రూ.13 కోట్ల నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

దర్వేశ్ ఆస్తుల జప్తుకు సూచన

దర్వేశ్ ఆస్తుల జప్తుకు సూచన

దర్వేశ్ ఆస్తుల జప్తుకు సూచన